కల్లు దొరకలేదని పిచ్చి పిచ్చిగా ప్రవర్తన.. : హైదరాబాద్ లో ఘటన

లోకల్ న్యూస్, హైదరాబాద్ : కల్లు లభించడం లేదని పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ మతిస్థిమితం కోల్పోవడమే కాకుండా ఫిట్స్‌ వస్తున్న వారిని రాజేంద్రనగర అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ రాజ్యలక్ష్మి ఆదివారం తన బృందంతో పరిశీలించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రభుత్వం కల్లు దుకాణాలు మూసివేసిన విషయం తెలిసిందే. అత్తాపూర్‌ పెద్దమ్మల బస్తీ, పాండవుల బస్తీతో పాటు సర్కిల్‌ పరిధిలోని రాజేంద్రనగర్‌, బుద్వేల్‌, ఉడంగడ్డ, హనుమాన్‌నగర్‌ తదితర బస్తీల్లో అలవాటు పడిన వారు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. కల్లు అమ్మే వారి ఇళ్ల వద్దకు వెళ్లి కల్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అత్తాపూర్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు గుర్రంపల్లి యాదగిరి రంగారెడ్డి జిల్లావైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మికి శనివారం లేఖ రాసి ఫోన్‌లో సమస్య వివరించారు. స్పందించిన ఆమె రాజేంద్రనగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ రాజ్యలక్ష్మిని అత్తాపూర్‌కు ఆదివారం పంపించారు. 

- 23 మంది డీఅడిక్షన్‌ సెంటర్‌కు..

అత్తాపూర్‌ పెద్దమ్మల బస్తీలో డాక్టర్‌ రాజ్యలక్ష్మి బృందం, స్థానిక నాయకులు గుర్రంపల్లి యాదగిరి, పుప్పాల లక్ష్మణ్‌ నేతృత్వంలో కల్లు తాగే అలవాటు ఉన్న 60 మందితో మాట్లాడారు. వారిలో 23 మంది తాము ఉంటున్న బస్తీ పేరు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని రాజ్యలక్ష్మి తెలిపారు. జాబితా తయారు చేసి జిల్లా వైద, ఆరోగ్యశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, వారిని ఎర్రగడ్డలోగల డీఅడిక్షన్‌ సెంటర్‌కు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 

Post a Comment

Previous Post Next Post