కరోనాకు ఒకరు బలి..!

హైదరాబాద్‌(లోకల్ న్యూస్): రాష్ట్రంలో తొలి కరోనా మరణం నమోదైంది. ఈ విషయం అతను చనిపోయిన తర్వాత బయటపడింది. 74 ఏండ్ల వృద్ధుడొకరు కరోనా లక్షణాలతో మృతి చెందినట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ శనివారం ప్రకటించారు. ఆ వృద్ధుడి భార్య, కుమారుడిని హోం క్వారంటైన్‌లో ఉంచినట్టు చెప్పారు. శనివారం ఆయన కొవిడ్‌- 19 కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఖైరతాబాద్‌లోని ఓల్డ్‌ సీఐబీ క్వార్టర్స్‌లో నివసించే ఆ వృద్ధుడు ఈ నెల 14వ తేదీన మతపరమైన కార్యక్రమం కోసం ఢిల్లీ వెళ్లాడు. 17న తిరిగి హైదరాబాద్‌ వచ్చాడు.

ఆయనకు ఈ నెల 19వ తేదీన జ్వరం, దగ్గు, ఆయాసం వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు స్థానికంగా ఓ ప్రైవేట్‌ దవాఖానలో చూపించారు. ఆయన అపస్మారక స్థితికి చేరుకోవడంతో 20వ తేదీన సమీపంలోని మరో కార్పొరేట్‌ దవాఖానకు తరలించారు. అయితే, ఆయన అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు. వ్యాధి లక్షణాలపై అనుమానంతో వైద్యులు సైఫాబాద్‌ పోలీసులకు సమాచారం అందించగా.. మృతదేహాన్ని గాంధీ దవాఖానకు తరలించారు. గాంధీ వైద్యులు మృతుడి నమూనాలను పరీక్షించగా.. ఆయనకు కరోనా పాజిటివ్‌ ఉన్నట్టు తేలిందని మంత్రి ఈటల వివరించారు. ఈ నేపథ్యంలో వివిధ దవాఖానల్లో ఇటీవల మరణించినవారి వివరాలను ఇవ్వాలని యాజమాన్యాలను కోరినట్టు తెలిపారు. 

ఖైరతాబాద్‌లోని ఓల్డ్‌ సీఐబీ క్వార్టర్స్‌లో నివసించే వృద్ధుడు కరోనా వ్యాధితో మృతిచెందిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. రెండంతస్థులున్న ఈ భవనంలో మొదటి అంతస్థులో మృతుడి కుటుంబసభ్యులు నివసిస్తుండగా,  పై అంతస్థులో కిరాయిదారులు నివసిస్తున్నారు. మృతుడి కుటుంబసభ్యులతోపాటు, కిరాయిదారులు కూడా హోంకార్వంటైన్‌లో ఉండాలని స్థానిక కార్పొరేటర్‌ పీ విజయారెడ్డి వారికి సూచించారు. అయితే మృతుడి కుటుంబసభ్యులు ఎలాంటి మాస్క్‌లు ధరించకుండానే సుమారు వారంరోజులపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరిగినట్టు స్థానికులు చెప్తున్నారు. కుటుంబసభ్యులు, కిరాయిదారులతోపాటు ఆ కాలనీ పరిధిలోని 400 ఇండ్ల ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని జీహెచ్‌ఎంసీ వైద్య విభాగం అధికారి భార్గవ నారాయణ పేర్కొన్నారు. ఓల్డ్‌ సీఐబీక్వార్టర్స్‌, పక్కనే ఉన్న ఇందిరానగర్‌కాలనీల్లో రసాయనిక ద్రావకాన్ని పిచికారి చేయిస్తామని చెప్పారు.

Post a Comment

أحدث أقدم