పులికి కరోనా పాజిటివ్... ప్రపంచంలో కరోనా సోకిన తొలి జంతువు..

లోకల్ న్యూస్, అంతర్జాతీయం : అది అమెరికాలోని బ్లాంక్స్ జూ (Bronx Zoo)... అందులోని నదియా అనే నాలుగేళ్ల వయసున్న పులికి కరోనా వైరస్ సోకినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ప్రపంచంలో కోరనా సోకిన తొలి జంతువు ఇదే అని ఫెడరల్ ప్రభుత్వం అధికారులు తెలిపారు. నదియాతోపాటూ... మరో ఆరు పులులు, సింహాలు కూడా అనారోగ్యం బారినపడ్డాయి. వాటిలో కొన్నింటికి ఆకలి తగ్గిపోగా... కొన్నింటిలో దగ్గు లక్షణాలు కనిపించాయి. జూలో ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకి ఉంటుందనీ, అతని ద్వారా... వాటికి కూడా కరోనా వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఎందుకంటే... ఇప్పటివరకూ ఆ ఉద్యోగికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించలేదు. మార్చి 27న పులి నదియాకి కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. ప్రస్తుతం అది రికవరీ అవుతోందని తెలిసింది. న్యూయార్క్‌లో కరోనా ప్రబలిన తర్వాత... మార్చి 16 నుంచి జూని మూసివేశారు.

పులికి కరోనా సోకడం తమను ఆశ్చర్యపరిచిందనీ, నమ్మలేకపోయామనీ జూ డైరెక్టర్ జిమ్ బ్రెహెనీ తెలిపారు. తాము కనుక్కున్న ఈ విషయం ప్రపంచ దేశాలకు ఎంతో కొంత ఉపయోగపడగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. వైరస్ ఎలా ప్రబలుతుంది? ఇతర జీవులకు ఎలా పాకుతుంది అన్నది ఇప్పుడు తెలిసే ఛాన్స్ ఉందని ఓ ఇంటర్వ్యూలో అన్నారు.

కరోనా టెస్టుల్ని మనుషులకు ఒకలా, జంతువులకు మరోలా నిర్వహిస్తారు. కాబట్టి రెండింటికీ పోటీ ఉండదు. మనుషులకు వాడే టెస్ట్ కిట్లను జంతువులకు వాడరు. ఐతే... ఈ కొత్త విషయం కరోనా వైరస్‌పై కొత్త ప్రశ్నలు రెకెత్తించింది. ప్రస్తుతం అమెరికాలోని పెంపుడు జంతువులు, పక్షుల్లో కరోనా వైరస్ లేదని అమెరికా వ్యవసాయ శాఖ తెలిపింది. జంతువుల ద్వారా కరోనా వైరస్ మనుషులకు సోకి ఉంటుందా అన్న ప్రశ్న ఇప్పుడు వేసుకోవడం సరికాదన్న వ్యవసాయ శాఖ... అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తికి జంతువులే కారణమా అన్నది ఇప్పుడు అసందర్భ ప్రశ్నగా తెలిపింది.

ఇప్పుడు ఆ జూ లోని అన్ని జంతువులకూ, జూ ఉద్యోగులకూ కరోనా టెస్టులు జరిపించాల్సిన అవసరం లేదన్న వ్యవసాయ శాఖ... నేషనల్ వెటెరినరీ సర్వీసెస్ లాబొరేటరీస్‌లో మిగతా పులులు, సింహాలకు జరిపిన పరీక్షల్లో నెగెటివ్‌గా తేలిందనీ, ఒక్క నదియాకి మాత్రమే పాజిటివ్‌గా వచ్చిందని తెలిపింది.

ఫిబ్రవరిలో హాంకాంగ్‌లో ఓ కుక్కకు కరోనా లక్షణాలు కనిపించాయి. ఐతే... దానికి సోకిన కరోనా వైరస్ పాథోజెన్... చాలా తక్కువ స్థాయిదని తేల్చారు. అందువల్ల పెంపుడు కుక్కలు, పిల్లుల వల్ల మనుషులకు కరోనా రాలేదనీ, అవి వైరస్‌ని వ్యాపింపజెయ్యట్లేదని తెలిపారు.

కరోనా వైరస్ సోకిన వారు... తమ పెంపుడు జంతువుల్ని తమకు దూరంగా పెట్టాలని అమెరికా వెటెరినరీ మెడికల్ అసోసియేషన్, ఫెడరల్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) సంస్థలు సూచించాయి. పెంపుడు ప్రాణుల్ని ముట్టుకున్న తర్వాత... చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలనీ, పెంపుడు ప్రాణుల్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలని CDC కోరింది.

Post a Comment

Previous Post Next Post