కరోనా... కరోనా...
బడి బావురుమంటోంది... !
గేట్ కు వేసిన తాళం ఎదురు చూస్తోంది ఎప్పుడెప్పుడు తీస్తారని !
బడిగంట మౌనంగా చూస్తోంది ఎప్పుడు కొడతారని !
బడి బావురుమంటోంది !!
అటెండర్ కూర్చోనే పాత బెంచి బేలగా చూస్తోంది ఇంకెప్పుడు నన్ను పావనం చేస్తారని !
ఆఫీస్ గదిలోని పాత గోడగడియారం అనుకుంటోంది నన్నెవరూ ఎందుకు చూడడం లేదని !
బడి బావురుమంటోంది !!
ప్రార్థనా స్థలం ఎదురు చూస్తోంది
సమయం ఇంకెప్పుడని !
మైకు మూగగా అర్థిస్తోంది ప్రార్ధనలోని పద్యం, సూక్తి మళ్ళెప్పుడని !
బడి బావురుమంటోంది !!
దుమ్ము కొట్టుకుపోయిన తరగతి గదులు చూస్తున్నాయి ఎవరెందుకు శుభ్రపరచడం లేదని !
డెస్క్ బెంచీలు టేబులు ఆలోచిస్తున్నాయి అల్లరి చేసే పిల్లలెక్కడ అని !
బడి బావురుమంటోంది !!
నల్లబల్లలు తెల్లబోతున్నాయి సుద్దముక్కల రాతలేవని !
బడితోట నోరెళ్ళబెట్టి ఏడుస్తోంది
తన కన్నీరు ఎప్పుడు తుడుస్తారోనని !
బడి బావురుమంటోంది !!
వంటగది చూస్తోంది పొయ్యి ఎందుకారిందని ఎప్పుడు రాజేస్తారని !
పిల్లల కంచాలు అడుగుతున్నాయి ఆకలి మీకు ఎప్పుడు వేస్తుందని !
బడి బావురుమంటోంది !!
ఆటస్థలం అడుగుతోంది తన గుండె చప్పుడు ఎందుకు వినిపించడం లేదని !
బడి అంటే 'సమాజనిర్మాణం' అనే ఆశావాదులు ప్రశ్నిస్తున్నారు
జవాబులు ఎప్పుడని !
బడి బావురుమంటోంది !!
పిల్లలు రాక కాదు రాలేక.
-బి.ప్రభాకర్ రెడ్డి
ప్రభుత్వఉపాధ్యాయుడు
మహాదేవపూర్
Post a Comment