లోకల్ న్యూస్, పలిమెల : అటవీ మండలమైన పలిమెలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీమ్ మొట్ట మొదటి సారి పర్యటించారు. కోవిడ్ 19 కోసం ప్రభుత్వం చేపడుతున్న పనుల తీరును ఆయన పరిశీలించారు. మండలంలో వలస కూలీలు సంఖ్య, వారికి అందుతున్న సేవల గురించి స్థానిక తహసీల్దార్ ని అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా మండలంలో నివసిస్తున్న గిరిజనులు, గొత్తికోయలు అందుతున్న నిత్యావసర సరుకుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే మండలానికి సరిహద్దుగా ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుంచి మండలానికి వచ్చే మార్గాలు ఏమైనా ఉంటే అక్కడ ప్రజలు రాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మండలంలో కరోనా వైరస్ పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలు, చర్యలు ఎలా ఉన్నాయో పరిశీలించారు. మండల కేంద్రంలో నిర్మించిన సమీకృత భవనాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుండి భూపాలపల్లికి బయలుదేరిన కలెక్టర్ మార్గ మధ్యంలో ఉన్న గ్రామాల్లో పరిస్థితులను పరిశీలించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ మంజుల, ఎంపీవో నాగరాజు, ఎంపీపీ బుచ్చక్క,జడ్పీటీసీ గుండెబోయిన హేమలత, సర్పంచ్ జవ్వాజి పుష్పలత-తిరుపతి, ఎంపీటీసీ కల్యాణి ఉన్నారు.
Post a Comment